ఆర్డర్లు లేవు ఆదాయం లేదు! స్వర్ణ కాంతులు లేని '2016'
"వర్కర్లకు ఆర్థిక, మానసిక వత్తిడి కి గురిచేయనున్న 2017"?
వృత్తిని వదులుకోలేక, కొత్త మార్గం పట్టలేక మానసికంగా నలిగిపోతున్న వందల మంది స్వర్ణకారులు. 

* మసిబారిన స్వర్ణకార జీవితాలతో ఎదుగు, బొదుగు లేకుండా బంగారం పని ఎందుకు నేర్చుకున్నాం రా! అని బాధ పడే సందర్భం వచ్చింది! ఇంకో ఆరు నెలల పైగా పనులు ఆర్డర్లు ఉండటం కష్టమే? 
అసలు ఈ యేడాది మొదటి నుంచి ఏదో ఒక రూపంలో బంగారం పని వారికి ఆర్థిక పరమైన దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 2016 మొదట్లో బంగారాన్ని సెంట్రల్ ఎక్సైజ్ పరిధిలోకి తీసుకురావడానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొన్ని నెలల పాటు జ్యూలరీషాపుల సమ్మె.. ఆ తర్వాత ముహూర్తాలు లేక.. ఆ తర్వాత ఆషాఢమాసం.. మధ్యలో కొన్నాళ్లు తక్కువగానే పనులు ఉన్నాయి. సంవత్సరం చివర్లో నోట్ల రద్దుతో బంగారం పని వారు చిన్నాభిన్నమై చితికి పోతున్నారు. రకరకాల కారణాలతో రెండు సంవత్సరాలుగా పనులు తగ్గుతున్నాయే కానీ పెరగడం లేదు. కొన్నాళ్ల పాటు పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయి. అనుమానమే లేదు. నోట్ల రద్దు, బంగారం మీద నిబంధనల కారణంగా.. జ్యూలరీషాపులలో ఉన్న నగల స్టాక్ ఐటీ సంస్థకు లెక్కలు, లైసెన్సులు లేని వారు లైసెన్సు తీసుకుని, ట్యాక్స్ కట్టి వైట్ చేసుకోడానికి కొంత సమయం పడుతుందని నా ఉద్దేశం. షాపుల యజమానులు కుదుటపడి, జనజీవనం సాధారణ స్థితికి వచ్చి బంగారపు వస్తువుల మీద దృష్టి పెట్టాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే! ఇంకో విషయం ఏమంటే కేంద్ర ప్రభుత్వం నగలు, ఆభరణములు వద్దనడంలేదు. బంగారం కడ్డీల, బిస్కెట్ ల రూపంలో నిల్వ వద్దు అంటుంది. కాబట్టి మనకు ఇబ్బంది లేదు. 
మరొకవైపు ప్రతి ఊరిలో బెంగాలీ స్వర్ణకారులు వందల మంది వచ్చారు. వారిని ఆపలేని పరిస్థితి. ఇప్పటికే స్వర్ణకారులు జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు "బంగారం పని చేసే వారికి, సేల్స్ మెన్ లకు పరీక్షా కాలం" అనవచ్చు. కారణం అసలు సాధారణ జ్యూలరీషాపులకు వ్యాపారం లేకపోవడం ఒక కారణం అయితే.. నగరాల్లో కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులతో వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో షాపింగ్ మాల్స్ రూపంలో నగల దుకాణాలు ఒక కారణం. డిజైన్ల విషయంలో మహిళల అభిరుచి మారడం కూడా ఒక కారణం. ఆమాట కొస్తే మహిళలపై ఈ అతిపెద్ద జ్యూలరీ షాపింగ్ మాల్స్ వారు పెద్ద పెద్ద ఆభరణాలు, వివిధ మోడల్స్ తీసుకొచ్చి అంటే విపరీతమైన రంగు రాళ్ల మోడల్స్.. అన్ కట్ డైమండ్స్ అనీ, కెంపు పచ్చ రాళ్ల ఐటమ్స్ తో గత ఐదేళ్లుగా మహిళలను ఆకర్షించి ఇప్పుడు ఆ ఆభరణాలే కొనేలా చేసి విజయం సాధించారు. ఇంట్లో పెళ్లి అనగానే ఆడవారికి పెద్ద నగల దుకాణం గుర్తుకు వచ్చేలా ప్రకటనలతో ఓ భావన కలుగజేశారు. అక్కడకు వెళ్లగానే.. మంచి మంచి డిజైన్స్ తో కొనేలా ఉంటాయి. ఈ కాలం వారికి ఎంతకాలం ఈ నగ నాణ్యత ఉంటుందనేది అనవసరం. డిజైన్ నచ్చిందా లేదా! అంతే! అదే మన స్వర్ణ కారుడు దగ్గర కొచ్చి లేదా పిలిపించుకుని నగల పుస్తకాల్లో డిజైన్ సెలెక్ట్ చేసుకుని చేయించుకుంటే ఎక్కువ కాలం ఆభరణం ఉంటుందనే స్పృహ ఈ కాలం వారికి తగ్గింది. 

అసలు ఇప్పుడు ఓ ముఖ్య విషయం గమనించాల్సింది.. గుర్తుతెచ్చుకోవాల్సిన విషయం ఒకటుంది! ఒకప్పుడు కుటుంబంలో ఓ ఆభరణమో, నాంతాడునో చేయించాలి అనగానే ఆ ఊరిలో ఉన్న బంగారం పని చేసే అతను గుర్తుకు వచ్చే వాడు. నేడు పుస్తెల తాడు కి కూడా డిజైన్స్ వాడే అలవాటు పెరిగింది. నేడు పుస్తెల తాడు చేయించాలి అనే మనస్తత్వం పోయి మంచి డిజైన్ కొనాలి అనే ఆలోచన మహిళల్లో వచ్చింది. వెంటనే పెద్ద షాపులకు వెళ్లి రెడీ గా ఉన్న మంచి మోడల్స్ అంటే దళపతి చైన్, చిరుత చైన్, చంద్రముఖి చైన్, రోప్ చైన్, కొబ్బరితాడు లాంటి పదిహేను డిజైన్ల పైగా ఉన్న చైన్స్ కొని.. వాటికి మంగళసూత్రాలు తగిలించి వేసుకుంటున్నారు. పట్టణాల్లో 35 సంవత్సరం లోపు వారు 95 శాతం మంది మంగళసూత్రాల చైన్ లు మోడల్స్ వాడుతుంటే, గ్రామాల్లో 30 సంవత్సరాల లోపు వారు 60 శాతం మంది ఈ డిజైన్ రెడీమేడ్ చైన్ లు వాడుతున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే మన స్వర్ణకారుల ఇంట్లో ఆడవాళ్లు డిజైన్ల మీద మోజు తో 40 నుంచి 50 శాతం మంది రెడీమేడ్ సూత్రాల చైన్స్ వాడుతున్నారు. మగవారు మెడలో చైన్ లు దాదాపుగా 90 శాతం మంది రెడీమేడ్ మిషన్ చైన్ లు వాడుతుంటే స్వర్ణకారులు మెడలో చైన్ లు వేసుకొనే అలవాటు ఉన్నవారు 50 శాతం పైగా రెడీమేడ్ చైన్ లు వేసుకుంటున్నారు. ఇంతమంది వినియోగదారులు, స్వర్ణకారులు రెడీమేడ్ వస్తువులకు ఆకర్షణ గురవుతుంటే బంగారం పనివారికి పనులు ఎందుకుంటాయి మిత్రులారా! 
రెడీమేడ్ చైనులు కానీ వేరే ఆభరణాలు కానీయండీ.. ఇంతగా ఆకర్షించడానికి అసలు కారణం ఫ్యాషన్ గా ఉంటూ రెడీమేడ్ ఐటమ్స్ తక్కువ తూకంలో పెద్ద వస్తువులా, లావుగా కనబడుతాయి. కానీ రెడీమేడ్ వి నాణ్యత విషయంలో అంటే రిపేర్లు తొందరగా వస్తాయి. ఆ ఆలోచన ఈకాలం వారికి అనవసరం అంతే.. ఫ్యాషన్ ఫ్యాషన్ అంతే.. పాతకాలంలో మంగళసూత్రాలకు నాంతాడు కొంచెం స్థితిమంతులైతే రెండు పేటల నాంతాడు వాడేవారు. ఈకాలం వారు నాంతాడు మోటు అంటున్నారు. సరే కనీసం మలబార్ చైన్ లాంటి డిజైన్లు చేయించుకున్నా చాలా బాగుంటుంది. మన్నిక బాగుంటుంది. రెడీమేడ్ పుస్తెల చైనులు 5 సంవత్సరాలకు మించి ఉండవు. జాగ్రత్తగా వాడితే ఇంకో సంవత్సరం వస్తుంది. అదే వర్కర్ తో మన సంప్రదాయ నాంతాడు చేపిస్తే 15 సంవత్సరాలు నాణ్యత ఉంటుంది. అసలు చైన్ స్నాచర్స్ కి ఈజీ లాగగానే తెగిపోయి రావడానికి కారణం ఈ రెడీమేడ్ చైనులే. ఇవి చూడటానికి లావుగా ఉంటాయి కానీ లోపల అంతా డొల్లే... ఇప్పుడు మెడలో ఉన్న పుస్తెల తాడు 1995 లేదా 2000 సం: లోపు చేయించుకుని వాడుతున్న వారెవరన్నా ఉన్నారా అని ఆలోచించి విచారణ చేస్తే 10 శాతం మంది ఉంటే గొప్ప విషయంగా భావించవచ్చు.
        ***------------------------------------***
బంగారం పనికి ఇంకో పెను ప్రమాదం.. ఇమిటేషన్ నగలు రూపంలో రాబోతుంది. మధ్యతరగతి ప్రజలు భీభత్సంగా వాడే రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే హాల్ మార్క్ బంగారు నగలకు ఏమాత్రం తీసిపోకోకుండా బ్రాండెడ్ నగలు షాపింగ్ మాల్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే నగరాల్లో వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. అక్కడక్కడ ఊర్లలో కూడా పెళ్లిళ్లలో వాడటం నేను గమనిస్తున్నాను.

** కూడు గూడు గుడ్డ అన్నారు పెద్దలు **
అవి సమకూర్చున్న వెంటనే పాతతరం వారు బంగారం మీద దృష్టి పెట్టేవారు. ఈ తరం మధ్య తరగతి ప్రజల్లో వస్తు వ్యామోహం పెరిగింది అనడం కంటే అవసరమైపోయాయి అనాలేమో ఈ కాలంలో.. అద్దెకు ఉంటున్నా పెద్ద ఫ్రిజ్, ఇన్ వర్టర్, ఏసి, బైక్, యాక్టివా, కాస్ట్లీ మొబైల్, ఆన్ లైన్ షాపింగ్ ఇంకా ఇంకా.. అనేకం తప్పనిసరి అయినవి. ఒకప్పుడు ముందు స్థలం కొందామని ఇల్లు కట్టుకుందామని.. బంగారం కొందామని అనుకునే వారు. నేడు బంగారు వస్తువుల మీద ప్రేమ తగ్గింది. అందుకే ఇమిటేషన్ నగలు వ్యాపారం పెరిగింది. ఇలాంటి అనేక సామాజిక మార్పు, నాగరికత వల్ల చేతి వృత్తుల మీద.. బంగారం పని కార్మికుల పై ఆ ప్రభావం చూపుతోంది. 

ప్రస్తుతం బంగారం పనిలో కొనసాగాలంటే కొన్నాళ్లు ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. అయితే కొంతమంది స్వర్ణకారులకు అత్తగారింటి నుండి ఆర్థికంగా ఆదరణ ఉండి, ఇంకొంతమందికి తల్లిదండ్రుల ద్వారా ఆర్థిక పోషణ ఉండే అవకాశం ఉన్న వారికి ఇబ్బంది లేదు. చక్కగా చేసుకోండి ఇబ్బంది లేదు. కానీ ఆరు నెలల నుంచి లేదా సంవత్సరం పైగా పనులు వ్యాపారం లేని వారు ఏ రకంగాను ఆర్థికంగా అండదండలు లేకుండా పనిమీదే బ్రతకాలి అనుకునే వారు ఇబ్బందులు పడి అప్పులు అయ్యే బదులు అవకాశం మేర వేరే వృత్తి, వ్యాపారంలోకి వెళ్లడం మంచిదని నా అభిప్రాయం. పనులు లేకపోవడం ఒక బాధ అయితే, పని వచ్చిందంటే సమయం ఇవ్వడం లేదు పని ఇచ్చిన వారు.. స్పీడ్ గా తయారుచేసే క్రమంలో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీన్ని ప్రశ్నిస్తే పని ఇవ్వడన్న భయంతో బ్రతకాల్సి వస్తుంది. అంతంత మాత్రంగానే ఉన్న పనులకు పాయింట్లు (మజూరి) తగ్గి ఏమీ మిగలడంలేదు. ఇంటి అద్దె, షాపు అద్దె కట్టి కరెంటు బిల్లులు, పిల్లల స్కూల్ ఫీజులు కట్టి మనం తినడానికి ఏమీ మిగలడంలేదు. ముఖ్యంగా మంగళగిరి విజయవాడ ప్రాంతంలో వారికి నేను చెప్పేది ఏంటంటే.. అవకాశం ఉన్న మేర మెల్లగా వేరే వృత్తి, వ్యాపారాల మీద దృష్టి పెడితూ మన పని చేసుకుంటూ.. అవకాశం వచ్చినప్పుడు జంప్ అయిపోవడం మంచిది. ఒకవేళ అక్కడ సక్సెస్ అవ్వలేదు ఇక్కడ బంగారం పనులు పర్లేదు అనుకుంటే మళ్లీ రావచ్చు. వేరే పనుల్లో సక్సెస్ అయితే అక్కడ ఉండటమే. నాకు తెలిసిన వారు ఇప్పటికే కర్రీస్ పాయింట్లు, చికెన్ కొట్లు, హోటళ్ల వ్యాపారం.. రియల్ఎస్టేట్ మధ్య వర్తిత్వం లోకి వెళ్లి స్థిర పడటం నేను చూస్తున్నాను. విజయవాడలో నెంబర్ వన్ వర్కర్ గా పేరు తెచ్చుకున్న కుర్రాడు కొన్ని నెలల క్రితం కైకలూరు వెళ్లి అక్కడ మోడరన్ చికెన్ పేరిట షాపు పెట్టి సక్సెస్ అయ్యాడు. గత శుక్రవారం ఓ బంగారం డై మిషన్ కటింగ్ అతను తన వర్కర్లతో సూపర్ మార్కెట్ తరహాలో కిరాణా షాపు ప్రారంభించాడు.
      -------------------------------------------------
👇స్వర్ణకారునికి,వినియోగదారునికి మధ్య ఉన్న వ్యవస్థ గురించి 👇

ఇక బంగారం పనులకు పూర్వ వైభవం రావాలంటే.. 
వినియోగదారులు ఆభరణములు చేయించుకోవాలని ఆలోచన రాగానే ఆ ఊరిలో ఉన్న స్వర్ణకారులు గుర్తుకు రావాలి. ఒకప్పుడు ఏ ఆభరణం లేదా చిన్న వస్తువు అయినా పెద్ద వస్తువు అయినా చేపించాలంటే స్థానికంగా ఉన్నవారితోనే చేపించేవారు. గతంలో తమకు కావల్సిన బిస్కెట్ బంగారం పట్టణంలోని షరాబు షాపులో కొనుగోలు చేసి తమ ఊర్లలో చేపించేవారు. అంటే వినియోగదారులకు వర్కర్లకు మంచి అవగాహనతో ఓ వ్యవస్థ ఉండేది. రాను రాను ఆ పద్ధతి పోయి ఆ షరాబులు కొన్ని వస్తువులు, ఆభరణములు తయారు చేపించి పెట్టి మెల్లగా అమ్మకాలు మొదలు పెట్టారు. 
మొదట వెండి, బంగారం అమ్మకాలకు పరిమితమైన షరాబులు మెల్లమెల్లగా వినియోగదారుల్ని తమ వైపు తిప్పుకున్నారు. వినియోగదారులు తమనే నమ్మే పరిస్థితి కల్పించారు. వినియోగదారునికి షరాబుపై మోజు పెరిగి, స్వర్ణకారునిపై నమ్మకం సన్నగిల్లింది. మా దగ్గర చేయించండి మా దగ్గర నమ్మకమైన వర్కర్లు ఉన్నారు మంచి పదహారణాల వన్నెతో చేపిస్తాము.. మీ ఊర్లలో మోసం జరుగుతుందని మెల్లగా వినియోగదారులకు స్వర్ణకారులకు మధ్య దూరాన్ని పెంచి వ్యాపారం చేసి బాగా సంపాదించారు. కానీ నేడు ఆ షాపులకు వ్యాపారం లేక మనకు ఆర్డర్లు రావడం లేదు. షాపింగ్ మాల్స్ లో వ్యాపారం ఉన్నా.. వారి వల్ల మనకు పని రాదు. రిపేర్లు చేయడానికి మనల్ని ఉపయోగ పెట్టుకుంటారు. ఫలితం నేడు షరాబు కూడా పోయి కార్పొరేట్ జ్యూలరీ షాపింగ్ మాల్స్ వచ్చేసి అటు చిన్న జ్యూలరీషాపుల వారు ఇటు బంగారంపని వారు మొత్తం బలి అయ్యే పరిస్థితి వచ్చింది. తిరిగి ఆ వ్యవస్థ తీసుకురావడం మన వల్ల అయితే కొంతమేర పనులు ఉంటాయి. ఇంకో విషయం మన బంగారం పని వారు ఏ రకమైన రెడీమేడ్ నగలు ధరించకుండా మన వర్కర్ల చేత మనం చేయించుకుంటే ఎంతోకంత పని కల్పించిన వారం అవుతాము.
👇***************************👇
ఇక నుంచి స్వర్ణకారులు మిషన్లతో తయారైన రెడీమేడ్ చేతి ఉంగరాలు, మెడలో చైనులు వేసుకుంటున్న వారు తీసేసి స్ధానిక వర్కర్లతో చేయించినవే వాడాలి. రెడీమేడ్ నగలు తమ ఇంట్లో వారు హాంగింగ్స్, గాజులు ఏ రకమైన వస్తువులు వాడుతున్నా జ్యూలరీ షాపింగ్ మాల్స్ ని తిట్టకూడదు. మిషన్లతో తయారైన నగలు ఎవరు వాడినా స్వర్ణకారుల సంఘంలో పదవులకు అనర్హుడుగా ప్రకటించాలి. 
👆***************************👆

Post a Comment

 
Top